నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.. అందుకే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా నరకం అనుభవిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..
By - అంజి |
నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.. అందుకే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
హైదరాబాద్: మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా నరకం అనుభవిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ నీళ్లు తాగిన మహిళలకు పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ నీళ్లు, ఆ నీటితో పండించే పంటలను తిని.. అక్కడి మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారని పేర్కొన్ఆరు. అందుకే మూసీని ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జన్మించి, సుమారు 240 కిలోమీటర్ల మేర ప్రవహించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుందని ఆయన పేర్కొన్నారు. నది పొడవునా కాలుష్యాన్ని నిర్మూలించి, పరివాహక ప్రాంత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నదులను కాపాడాల్సిన వారే వాటిని ఆక్రమిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్‌హౌస్‌ల డ్రైనేజీలను తీసుకెళ్లి గండిపేట్, హిమాయత్ సాగర్‌కు కనెక్షన్లు ఇచ్చారని తెలిపారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం జలవనరులను కాపాడటంలో విఫలమయ్యిందని విమర్శించారు.
రాబోయే తరాల కోసం వీటిని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనం కోసం లండన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో అధ్యయనం చేశామని సీఎం రేవంత్ తెలిపారు. గుజరాత్ సబర్మతి, యూపీ గంగా నది తరహాలోనే మూసీని వ్యాపార కేంద్రంగా మారుస్తామన్నారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పిస్తూనే, గండిపేట నుంచి గౌరెల్లి వరకు అభివృద్ధి చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.