తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  13 Sept 2024 9:00 PM IST
తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దాంతో.. చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వరద పోటెత్తింది. జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. ఇళ్లు కోల్పోయిన వారికి.. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే వరద బాధితులకు రూ.16,500 ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

కాగా.. తెలంగాణకు తక్షణమే వరదలతో నష్టపోయిన కారణంగా ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని ఈ మేరకు కోరారు. రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి అధికారుల బృందం వచ్చింది. వారితో సమావేశం అయిన సీఎం రేవంత్‌రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. అలాగే రాష్ట్రంలో సంభవించిన నష్టం గురించి వివరించారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలను సడలించాలని ఈ మేరకు సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఖమ్మంకు మున్నేరు వాగు వల్ల వరద ముప్పు నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారం అని చెప్పారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర సమాచారం ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర అధికారుల బృందానికి చెప్పారు. ఇంకా వరద నష్టంపై పూర్తిస్థాయిలో వివరాలు అందాల్సి ఉందని చెప్పారు.

ఒక వేళ తెలంగాణలో మరింత వరదలు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్‌లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లలో ఒక్క రూపాయి వాడుకునే పరిస్థితి లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో జరిగిన అపార నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వాటిని పరిశీలించి విపత్తు సాయం ఇతోధికంగా అందించాలని కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Next Story