సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణం చేస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 11:32 AM GMTసీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణం చేస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. కాగా.. విమానంలో సాంకేతిక లోపం వల్ల సీఎం రేవంత్‌రెడ్డి ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర పాటు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు.
అయితే.. ముంబైలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభ జరుగుతోంది. ఈ సభకు హాజరు అయ్యేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఇండిగో విమానంలో బయల్దేరారు. కానీ.. ఎయిర్‌పోర్టులో విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఇంజిన్ వేడెక్కడం గమనించినట్లు పైలట్ తెలిపారు. అందుకే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. ఇక మరమ్మతులు పూర్తయిన తర్వాత మళ్లీ ఇండిగో విమానంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ముంబైకి బయల్దేరి వెళ్లారు.