Telangana: సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతిష్టాత్మకమైన "సన్న బియ్యం" పంపిణీ పథకం దేశంలోని పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించడంలో ఇప్పటికే ఒక ప్రమాణాన్ని సృష్టించింది
By అంజి
Telangana: సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతిష్టాత్మకమైన "సన్న బియ్యం" పంపిణీ పథకం దేశంలోని పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించడంలో ఇప్పటికే ఒక ప్రమాణాన్ని సృష్టించింది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు.
భద్రాచలం ఆలయ పట్టణంలోని ప్రసిద్ధ సీతా రామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి ఆచారాలకు హాజరైన తర్వాత, ముఖ్యమంత్రి.. సారపాక గ్రామంలోని సన్నబియ్యం పంపిణీ పథకం లబ్ధిదారులలో ఒకరైన బురం శ్రీనివాస్ ఇంటికి కారులో వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శ్రీనివాస్ కుటుంబంతో కలిసి భోజనం చేశారు. భోజనం సమయంలో, వారి జీవన పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ముఖ్యమంత్రి రుచి చూశారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు లు సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వంటకాలను ఆరగించారు.
బియ్యం నాణ్యత గురించి ముఖ్యమంత్రి అడిగినప్పుడు గృహిణి తులసమ్మ మాట్లాడుతూ.. తమ కుటుంబం గతంలో సరఫరా చేస్తున్న ముతక బియ్యం కొనడానికి ఆసక్తి చూపలేదని అన్నారు. ఇప్పుడు, ఆమె కుటుంబం పిడిఎస్ దుకాణాల నుండి నాణ్యమైన సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి, ప్రతిరోజూ భోజనం ఆస్వాదించడం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి నెలా పేద కుటుంబాలకు తక్కువ ధరకు సన్నబియ్యం పంపిణీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తులసమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, కేవలం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ప్రయోజనాల గురించి కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం శ్రామిక మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉందని తులసమ్మ సంతోషం వ్యక్తం చేశారు.