గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై.. సమగ్ర విచారణకు సీఎం ఆదేశం
గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 6 March 2024 8:35 AM IST
గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై.. సమగ్ర విచారణకు సీఎం ఆదేశం
గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈరోజు సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఇటీవల ఈ పథకంలో జరిగిన భారీ అవినీతిని కాగ్ తమ నివేదికలో వేలెత్తి చూపిన విషయాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గుర్తు చేస్తూ.. అదులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా.. అని ఆరా తీశారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ. 3955 కోట్ల రుణం ఇచ్చిన చేసిన నేషనల్ కో ఆపరేటివ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణం ఇవ్వటం నిలిపి వేసిందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ వివిధ అభ్యంతరాలు లేవనెత్తడం, అవకతవకలను గుర్తించిందని, తదితర కారణాలతో ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు.
ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన అందజేసిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను పంపిణీ చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రెండో విడతలో 85488 మంది ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డబ్బు చెల్లించారని, దాదాపు రూ. 430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని చెప్పారు. ఈ పథకం అమలు జరిగిన తీరుపై రకరకాల అనుమానాలున్నాయని, దీంతో పాటు చేపల పెంపకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.