తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15 శాతం జీతం కట్‌: సీఎం రేవంత్‌

తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు.

By -  అంజి
Published on : 13 Jan 2026 8:18 AM IST

CM Revanth, govt employees, salaries, parents, Telangana

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15 శాతం జీతం కట్‌: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభవన్‌లో 'ప్రణామ్' వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్లను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడారు.

''వృద్ధ తల్లిదండ్రులు వారి రక్తాన్ని చమటగా మార్చి పిల్లలకు ఆస్తులు, విద్యను అందిస్తే, వయసు మీద పడినప్పుడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా మారి ప్రణామ్ పేరుతో డే-కేర్ సెంటర్లను ప్రారంభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, దానిపై ఫిర్యాదు అందితే ఉద్యోగస్తుల జీతాల్లోంచి 10 నుంచి 15 శాతం మేరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా చట్టంలో మార్పు తేవలసిన అవసరం ఉంది.

తెలంగాణలో పేదలకు వంద శాతం వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమగ్రమైన హెల్త్ పాలసీ తీసుకొస్తాం. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోందిం. అందులో భాగంగానే వందేళ్లుగా జరగని కుల గణనను విజయవంతంగా పూర్తి చేశాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను పూర్తి చేశాం. దేశంలో 2026 లో చేపడుతున్న జనభా లెక్కల్లో తెలంగాణ మాడల్‌ను ప్రమాణికంగా తీసుకుని కులగణన చేపడుతోందని చెబుతూ ఆ విషయాన్ని తెలంగాణ గర్వంగా చెప్పుకోగలదు.

రెండేళ్లలో సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని చెప్పను. కానీ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రణాళికా బద్ధంగా తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, పేద ప్రజలకు అండగా నిలిచే తొలి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పం..” అని ముఖ్యమంత్రి వివరించారు.

Next Story