బీఆర్‌ఎస్ బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అసెంబ్లీ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు.
By అంజి Published on 21 Jun 2024 6:38 AM GMTఆసక్తికర పరిణామం.. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి మాజీ స్పీకర్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని జూన్ 21, శుక్రవారం నాడు ఆయన నివాసంలో కలిశారు. పోచారం, ఆయన కుమారుడికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పీసీసీ చీఫ్ రేవంత్. అనంతరం రేవంత్, పోచారం మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని.. ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ఆకర్షితుడినై తాను కాంగ్రెస్‌లో చేరినట్టు పోచారం తెలిపారు. రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులను మెచ్చి ఆయనను తన ఇంటికి ఆహ్వానించానని పోచారం తెలిపారు. రాజకీయంగా ఇంకా తాను ఆశించేది ఏం లేదని చెప్పారు. తాను ఆశించేది రైతు సంక్షేమం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉండి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్నారు.
శ్రీనివాస్ రెడ్డి 1976లో గ్రాండ్ ఓల్డ్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత 1984లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరి, ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్‌లో రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు, మొదట గనులు, భూగర్భ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2011లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉధృతంగా ఉన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే, సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్- ఇప్పుడు బీఆర్‌ఎస్)లో చేరారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ మంత్రివర్గంలో 2014-2018 మధ్య వ్యవసాయం, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు, తరువాత 2019-2023 మధ్య రాష్ట్ర 2వ అసెంబ్లీ స్పీకర్ అయ్యారు.