'సెమీకండక్టర్‌ ప్రాజెక్టను ఆమోదించండి'.. కేంద్రమంత్రి అశ్విని వైస్ణవ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

By అంజి
Published on : 18 July 2025 6:26 AM IST

CM Revanth, Ashwini Vaishnaw, Central govt, Semiconductor Projects

'సెమీకండక్టర్‌ ప్రాజెక్టను ఆమోదించండి'.. కేంద్రమంత్రి అశ్విని వైస్ణవ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం, ప్రపంచ స్థాయి ప‌రిశోధ‌న‌, అభివృద్ధి కేంద్రాల తెలంగాణలో ఉన్నందున ప్ర‌తిపాదిత‌ అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (#ASIP) ప్రాజెక్ట్, మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెల‌పాల‌ని కోరారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రైల్ భ‌వ‌న్‌లో అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్‌ ఎలక్ట్రానిక్‌ పార్క్‌ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద తెలంగాణ అభ్యర్థనను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. రీజిన‌ల్ రింగు రోడ్డు స‌మీపంలో నూత‌న ఎల‌క్ట్రానిక్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ‌లో రైల్వే అనుసంధాన‌త పెంపు కోసం నూత‌న ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగు రోడ్డుకు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్ర‌తిపాదించామని, ఇందుకు రైల్వే బోర్డు ఇప్ప‌టికే ఫైన‌ల్ లొకేష‌న్ స‌ర్వేకు అనుమ‌తి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

రూ.8 వేల కోట్ల విలువైన ఈ రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్ట్‌కు త్వ‌ర‌గా అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. రీజిన‌ల్ రింగ్ రైలుతో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెర‌గ‌డంతో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌ధాన స్టేష‌న్ల‌లో ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు. రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేద‌రికం త‌గ్గ‌డంతో పాటు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయ‌ని చెప్పారు.

హైద‌రాబాద్ డ్రైపోర్ట్ నుంచి బంద‌రు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి కోరారు. ఔష‌ధాలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు, ప‌లు దిగుమ‌తుల‌కు ఈ మార్గం దోహ‌ద‌ప‌డుతుంద‌ని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆప‌రేష‌న్స్‌ను మ‌రింత స‌మ‌ర్థంగా నిర్వ‌హించేందుకు కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌యాణికుల‌కు భ‌ద్ర‌త‌, వేగ‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు.

తెలంగాణ‌లో వివిధ ప్రాంతాల అనుసంధాన‌త‌, పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ‌క ఎగుమ‌తులు, దిగుమ‌తుల కోసం వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి నూత‌న రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. ఇందులో భాగంగా వికారాబాద్‌ - కృష్ణా (122 కి.మీ. అంచ‌నా వ్య‌యం రూ.2,677 కోట్లు), క‌ల్వ‌కుర్తి - మాచ‌ర్ల (100 కి.మీ. అంచ‌నా వ్య‌యం రూ.2 వేల కోట్లు), డోర్న‌క‌ల్‌ - గ‌ద్వాల (296 కి.మీ. అంచ‌నా వ్య‌యం రూ.6,512 కోట్లు), డోర్న‌క‌ల్‌ - మిర్యాల‌గూడ (97 కి.మీ. అంచ‌నా వ్య‌యం 2,184 కోట్లు) మార్గాల‌ను వంద శాతం రైల్వే శాఖ వ్య‌యంతో మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

Next Story