నేను డాక్టర్‌నే.. సమాజంలోని సమస్యలకు చికిత్స అందిస్తా: సీఎం రేవంత్
గుండె సంబంధిత వ్యాధుల నివారించాలన్న లక్ష్యంతో అందరం కలిసి ఒక మిషన్‌గా పనిచేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
By - అంజి |
నేను డాక్టర్‌నే.. సమాజంలోని సమస్యలకు చికిత్స అందిస్తా: సీఎం రేవంత్
హైదరాబాద్: గుండె సంబంధిత వ్యాధుల నివారించాలన్న లక్ష్యంతో అందరం కలిసి ఒక మిషన్‌గా పనిచేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్డియాలజిస్టులు స్పచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) చేయడంలో శిక్షణ ఇవ్వగలిగితే దేశంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఫౌండేషన్ (ICRTF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ -2026 లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 500 మంది కార్డియాలజిస్టులు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను వృత్తి పరంగా డాక్టర్ కానప్పటికీ, నిర్వహిస్తున్న పదవీబాధ్యతల పరంగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తూ, సమాజంలోని సమస్యలకు చికిత్స అందిస్తానని చెప్పారు. సీపీఆర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించగలిగితే సమాజానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని, ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని అన్నారు.
“వైద్యులు మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రభుత్వ పరంగా ఆరోగ్య సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ విధానాలను మరింత మెరుగుపరచేందుకు మీలాంటి వైద్యులతో కలిసి పని చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ సూచనలు, అభిప్రాయాలు అందించండి.
ఆరోగ్య సంరక్షణకు సంబంధించి నాణ్యత విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలి. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అత్యుత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. వైద్యులు నిరంతరం నేర్చుకుంటూ, సేవలు అందిస్తూ ఎదుగుతూ ఉండాలి.
చాలామందికి వైద్యులుగా మారే అర్హత సాధించలేరు. కానీ సమాజంలో మీరు ప్రత్యేకమైన గ్రూపు. మీ సంరక్షణలో ఉన్నప్పుడు మా ప్రాణాలకు ఎలాంటి ఢోకా లేదని మీపై నమ్మకం పెట్టుకుంటాం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్, వాటి అనుబంధ రంగాల్లో హైదరాబాద్ ఒక హబ్‌గా శరవేగంగా ఎదుగుతోంది. ఇంతటి గొప్ప సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషంగా ఉంది.
సదస్సులో పాల్గొన్న నిపుణులైన వైద్యులు, కార్డియాలజిస్టులు నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఇక్కడికి రావడం అభినందనీయం. నిరంతర అభ్యాసం, కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపిన రోజు మీరు మీ వృత్తికి ముగింపు పలికినట్టే. విజ్ఞానం, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు (#AI) వంటి సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ అత్యంత హైటెక్ రంగంగా మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మీరంతా ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిలా అప్‌డేట్‌గా ఉండాలి.
అయితే వైద్యులు మనుషులతో మమేకమయ్యే మానవీయ స్పర్శను కోల్పోవద్దు. ముఖ్యంగా వైద్యుల విషయంలో హైటెక్, అలాగే హైటచ్ రెండూ కలిసే నడవాలి..” అని ముఖ్యమంత్రి అభిలషించారు.
సదస్సులో #FellowsIndia ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎన్. ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ ఎ. శరత్ రెడ్డితో పాటు వైద్య నిపుణులు పాల్గొన్నారు.