ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

By అంజి  Published on  12 March 2024 1:01 AM GMT
CM Revanth, Indiramma houses scheme, Telangana

ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు మంజూరు 

తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న సదాశయంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. సోమవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులు శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నమూనాను ఆవిష్కరించారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుందని, కాబట్టే ఇండ్లను ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇది యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచే కార్యక్రమంగా అభివర్ణించారు. రూ. 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ పథకం ప్రారంభించినా ఈ ప్రజా ప్రభుత్వం కచ్చితంగా పూర్తి చేసి తీరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

భద్రాద్రి రాముల వారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని, ముఖ్యంగా గోదావరి నది రిటెయినింగ్ వాల్‌ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల మేరకు లబ్ది చేకూర్చడం, రూ. 500లకే వంటగ్యాస్‌ సిలిండర్‌ అందించే కార్యక్రమం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించడం వంటి నిరుపేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి వివరించారు.

Next Story