ఫాక్స్‌కాన్‌ విస్తరణకు సీఎం రేవంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

By అంజి  Published on  15 Oct 2024 1:40 AM GMT
CM Revanth, Foxconn expansion, Telangana, Kongarakalan

ఫాక్స్‌కాన్‌ విస్తరణకు సీఎం రేవంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కలిసి ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్‌ కంపెనీని సందర్శించారు.

ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై.. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ సీఈవో, చైర్మన్ సిడ్నీ ల్యూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ విస్తరణకు మరో 60 ఎకరాల భూమిని కేటాయించడానికి సీఎం రేవంత్‌ సానుకూలత వ్యక్తం చేశారు.

కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ఫాక్స్‌కాన్‌ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story