హైదరాబాద్: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో గురువారం పట్టపగలు ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించారు.
చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని... మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సంజీవ్‌ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూతగాదాలే ఈ హత్యకు కారణం.
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కొందరు హత్యలు, దారుణాలకు పాల్పడుతున్నారన్న సీఎం.. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన అమానవీయ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణమే బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉట్కూరు ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు
కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉట్కూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ బిజ్జ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబీకులు సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా సబ్ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విలువైన ప్రాణం పోయిందని ఉన్నతాధికారులు తెలిపారు. హత్యకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.