కేసీఆర్ పాలన తెలంగాణలోని గిరిజనులకు స్వర్ణయుగం : హరీశ్‌రావు
CM KCR’s rule is golden era for tribal people in TS. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తెలంగాణలోని గిరిజనులకు స్వర్ణయుగమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు
By Medi Samrat Published on 30 Jun 2023 4:16 PM ISTముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తెలంగాణలోని గిరిజనులకు స్వర్ణయుగమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దశాబ్దాల నాటి సమస్యను ముఖ్యమంత్రి శాశ్వతంగా పరిష్కరించడంతో.. పోడు భూములకు పట్టా పాసు పుస్తకాల పంపిణీ ద్వారా గిరిజనుల కల సాకారమైందన్నారు. గత 60 ఏళ్లలో మూడు లక్షల ఎకరాల పోడు భూములు మాత్రమే పంపిణీ చేశారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు ఏకంగా నాలుగు లక్షల ఎకరాలకుపైగా పోడు భూములను పంపిణీ చేస్తోందని.. ఇది గిరిజనులకు పండుగ లాంటిదని అన్నారు.
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి హరీశ్‌రావు శుక్రవారం పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన నాలుగు లక్షల ఎకరాల పోడు భూముల్లో దాదాపు మూడింట ఒక వంతు కొత్తగూడెంలో పోడు సాగుదారులకే దక్కిందన్నారు. ట్టాలతో పాటు పోడు రైతుల వివరాలను ధరణి పోర్టల్‌లోకి నమోదు చేస్తారు. వారికి కూడా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, బిందుసేద్యం సెట్లు అందజేస్తామని హరీశ్‌రావు తెలిపారు.
గతంలో అటవీశాఖ సిబ్బందితో పోడు రైతుల గొడవల నేపథ్యంలో వారిపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకునేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకృతి వైపరీత్యాల విషయంలో పోడు రైతులు కూడా పరిహారం పొందేందుకు అర్హులని తెలిపారు. కాంగ్రెస్ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తండాలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ దానిని అమలు చేయడంలో విఫలమైంది. అయితే కేసీఆర్ స్వయం పాలన కోసం 2,471 తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా తన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని గిరిజన వర్గాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచింది. రిజర్వేషన్ల పెంపుతో ప్రతి సంవత్సరం 500 మంది గిరిజన విద్యార్థులు ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు పొందుతున్నారు. కొత్తగూడెం, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి వంటి గిరిజన జిల్లాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత తొమ్మిదేళ్లలో 22 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, 95 గిరిజన విద్యార్థుల కోసం గురుకుల కాలేజీలు ఏర్పాటు చేయగా, గత 65 ఏళ్లలో గత ప్రభుత్వాలు 91 కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేశాయన్నారు
ఏజెన్సీ గ్రామాల ప్రజలు గతంలో వర్షాకాలంలో సీజనల్, నీటి ద్వారా వచ్చే వ్యాధులకు గురయ్యేవారు. ఇప్పుడు మిషన్ భగీరథ రక్షిత ద్వారా మంచినీటి పంపిణీతో సమస్య పరిష్కారమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓట్ల కోసం ఉపయోగించుకున్నాయని, వారిని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి గిరిజనుల బాగోగులు చూసి వారి కోరిక తీర్చారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఆశీర్వదించాలని ఆయన అన్నారు.