ఆ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై విషం చిమ్ముతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
By అంజి Published on 22 Aug 2023 12:56 AM GMTఆ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై విషం చిమ్ముతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం స్పష్టం చేశారు. 2023 ఎన్నికలకు బీఆర్‌ఎస్ నామినీల తొలి జాబితాను విడుదల చేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ''కుల పత్రికలు, గుల పత్రికలు'' అనే రెండు రకాల వార్తాపత్రికలు ఉన్నాయని ఆయన అన్నారు. కొన్ని దినపత్రికలు కుల ఆధారిత ఎజెండాతో, మరికొన్ని దురదతో ఉంటాయి. ఇతరుల ఎజెండాకు అనుగుణంగా వ్యవహరించే తోలుబొమ్మలను జర్నలిస్టులుగా పరిగణించరాదు. జర్నలిస్టుల హౌసింగ్ ఫైల్ ప్రక్రియ చివరి దశలో ఉంది, దానిని పరిశీలిస్తామని చెప్పారు. కొన్ని వార్త పత్రికలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై, అభివృద్ధిపై విషం చిమ్ముతున్నాయి. వారికి మాత్రం ఇళ్ల స్థలాలు ఇచ్చేదే లేదన్నారు.
''పాలు పోసి పామును పెంచలేం కదా? జర్నలిస్టులు ఒక విజన్‌తో ఉండాలి. కీలుబొమ్మలా ఉండకూడదు కదా? దేశంలో తెలంగాణతో పోల్చుకోవడానికి భయపడే రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. రైతు రుణమాఫీ చేయడం లేదని రాశారు. మొన్న ఒక్కసారే రూ.20 వేలకోట్ల మాఫీ చేసినం. ఇప్పుడు ఆ పేపర్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటది? అదొక పేపరా? దానికొక విలువ ఉన్నదా?'' అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్‌బీఐ రిపోర్టులు వచ్చాయన్నారు. నీతి ఆయోగ్ రిపోర్టులు వచ్చాయని, పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా చెప్పారన్నారు. అయినా సరే.. కొన్ని పత్రికలు ఒకటే రొడ్డ కొట్టుడు కొడతం అంటే ఎలా? అదేం పేపర్.. దిక్కుమాలిన పేపర్? అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతోకొంత మారాలి కదా? అని అన్నారు.