మహబూబాబాద్‌ జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

CM KCR's key announcement regarding Mahabubabad district. మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని తెలంగాణ

By అంజి  Published on  12 Jan 2023 3:16 PM IST
మహబూబాబాద్‌ జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమక్షంలో జిల్లా కలెక్టర్ శశాంక్‌ను తన స్థానంలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్బంగా జిల్లాపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధులపై పూర్తి అధికారం సర్పంచ్‌లదే అని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం అసమర్థత వల్ల తెలంగాణ రాష్ట్రం చాల నష్టపోయిందన్నారు.

అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రాజయ్య, పలువురు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story