తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవరి ఇండ్లలో వారే ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటంవల్ల కరోనా మహమ్మారి మరింత వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ కట్టడిలో తమ వంతు పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ కోరారు.
రాష్ట్రంలో నేడు 535 కరోనా పాజిటివ్ కేసులు
తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,339కు చేరాయి. ఇందులో 3,00,156 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1688 మంది మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 4495 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 1979 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 154 ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.06 శాతం, మరణాల రేటు 0.55 శాతం ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 57,942 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,00,19,096కు చేరింది.