తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. వాసాలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం విదితమే. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామంలో సమూహిక భోజనాలు చేసిన అనంతరం గ్రామసభను ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచ్‌కు ఫోన్‌లో తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు.
పల్లె ప్రగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల పర్యటనలో భాగంగా సీఎం వాసలమర్రికి రాబోతున్నారు. కాగా.. గతేడాది జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ పర్యటన ముగించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా వాసాలమర్రిలో ఆగి, స్థానికులతో మాట్లాడిన విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధిపై చర్చించిన ఆయన ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ దత్తత గ్రామానికి వెళ్తున్నారు.