తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలిసారి గాంధీ ఆస్పత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో.. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక గాంధీ ఆస్పత్రి.. కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో నిన్న (మంగళవారం) విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 3,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 27 మంది మరణించారు. ఒక్కరోజులో 5,186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 48,100 ఉన్నాయి. ఇక కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.