ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వర్షం వల్ల పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నేడు (గురువారం) ఈ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటన కొనసాగనుంది. దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకుని బాధల్లో ఉన్న రైతులకు భరోసా ఇవ్వనున్నారు.
వడగళ్ల వానలు కారణంగా వరి, జొన్న, ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున్న దెబ్బతిన్నాయి. చాలా చోట్ల మామిడి పండ్లు రాలిపోయి భారీగా నష్టం వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై అంచనా వేస్తున్నారు. ఈ నివేదికను కేసీఆర్‌కు ఇవ్వనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇదే..
- గురువారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు సీఎం కేసీఆర్ బయలు దేరనున్నారు.
- 10.15 గంటలకు బేగంపేటలో హెలికాప్టర్ ఎక్కి ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు.
- 11.15 నుంచి 11.45 గంటల వరకూ ఖమ్మం జిల్లా బొనకల్ మండలం రామాపురం గ్రామంలో పర్యటన
- 12.10 నుంచి 12.40 వరకూ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో పర్యటన
- 12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి
- మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి కరీంనగర్ జిల్లాకు
- 1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో పర్యటన
- 2.30 గంటలకు హెలిక్యాప్టర్‌లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్‌కు
- 3.15 గంటలకు బేగంపేటకు.. రోడ్డు మార్గంలో 3.30గంటలకు ప్రగతి భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు.