నేడు చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
CM KCR to address public meeting in Munugode today.మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2022 10:12 AM ISTమునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంది. ఈ ఎన్నికలో తమ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం నేడు(ఆదివారం) చండూరు పురపాలిక పరిధిలోని బంగారు గడ్డలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నాం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరు అవుతుండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా జన సమీకరణకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి చండూరుకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర అంశం చర్చనీయాంశంగా మారడంతో దీనిపై సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే ఆగస్టు 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో కేవలం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమతమైన సీఎం, నేడు జరిగే సభలో రాజకీయ అంశాలపై స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'ఎమ్మెల్యేలకు ఎర' అంశం దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు మినహా మిగిలినవారు ఈ అంశంపై పెద్దగా మాట్లాడలేదు. తాజాగా చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రస్తావించి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.