బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలకు డేట్‌ ఫిక్స్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందే ఉంటారు.

By Srikanth Gundamalla  Published on  19 Aug 2023 11:56 AM IST
CM KCR, Telangana, Elections, BRS List,

 బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలకు డేట్‌ ఫిక్స్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందే ఉంటారు. ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తారు. గతంలోనూ అసెంబ్లీని రద్దు చేసి.. అదే రోజు అభ్యర్థుల లిస్ట్‌ను కూడా ప్రకటించేశారు. ఆతర్వాత వేగంగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యూహంతో ముందుకెళ్లారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగినా.. అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకూలంగా లేదు. దాంతో.. ఎన్నికలు యథావిధిగానే జరగనున్నాయి.

అయితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ బీఆర్ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌పై ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా అదిగో.. ఇదిగో అంటూ అభ్యర్థుల జాబితా ప్రకటనను వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా.. బీఆర్ఎస్‌ అభ్యర్థులను జాబితా ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ఈ నెల 21న అభ్యర్థులను.. సీఎం కేసీఆర్ స్వయంగా తెలంగాణ భవన్‌ నుంచి ప్రకటించనున్నారు. అయితే.. అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యిందని.. దాదాపు 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. కేవలం సింగిల్‌ డిజిట్‌లో మాత్రమే మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మరో వైపు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై టికెట్‌ ఆశావాహులు విమర్శలు చేస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధిలో వెనబడటానికి కారణం ఎమ్మెల్యేలే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. తమకు టికెట్‌ కేటాయించాలని కోరుతున్నారు. ఇంకొన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉందని అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో మార్పులు ఉండేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్, అంబర్‌పేట, వరంగల్ తూర్పు, కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజవకర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్‌ లిస్ట్‌ దాదాపు ఖరారు అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అంతర్గతంగా నాయకులు పలువురు అసంతృప్తులను బజ్జగింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తుల విషయానికి వస్తే ఈసారి సింగిల్‌గానే బరిలోకి దిగేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని ఎన్నికల్లో కమ్యూనిస్టులను కలుపుకొని పోయినా.. ఈసారి వారితోనూ స్నేహం లేనట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా, పొత్తుల విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే ఆగస్టు 21 వరకు వేచి చూడాల్సిందే. ఆరోజు ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.

Next Story