టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి : సీఎం కేసీఆర్
CM KCR Speech in TRS Plenary.టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.
By తోట వంశీ కుమార్ Published on 27 April 2022 6:20 AM GMTటీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న టీఆర్ఆర్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు అని చెప్పారు. ఎన్నో ఒడిదొడుకులు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
దేశానికే రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని, కేంద్రం వివిధ సంస్థల నుంచి వస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శన మన్నారు. దేశంలోనే ఉత్తమ గ్రామాల జాబితాలో మొదటి 10 తెలంగాణ గ్రామాలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికాబద్దంగా ముందుకెలుతున్నామన్నారు. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెలుతున్నట్లు చెప్పారు.
అంతకముందు.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ అధినేత రాకతో హెచ్ఐసీసీ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, హరీశ్‌రావు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.