ఏ మాత్రం ఆదమరిచినా మళ్లీ మనకు ఆవేదన తప్పదు : సీఎం కేసీఆర్
CM KCR Speech in Telangana Jateeya Samaikyata Dinotsavam.తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు కొన్ని మతతత్వ
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు కొన్ని మతతత్వ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసు వందనం స్వీకరించారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికి సమైకత్యా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా హైదరాబాద్‌లో రాచరిక పాలన కొనసాగిందన్నారు. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగాల వల్ల తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్చ వైపు పయనించిందని చెప్పారు."స్వాత్రంత్య్రానికి పూర్వం భారతదేశంలోని అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవి. స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్‌లో విలీనం అయ్యాయి. ఆనాడు ప్రజా పోరాటాలు చేసిన మహనీయులందరినీ స్మరించుకుందాం. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారత దేశం ఆవిష్కృతమైంది" అని కేసీఆర్ అన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్ ఎంతో అభివృద్ధిలో ఉండేదన్నారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీలో కలిపారు. ఆ వీలినంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారు. ఆనాడు చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు ఎంతో నష్టపోయాం. సుదీర్ఘ పోరాటం తరువాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో పురోగమించిందన్నారు. ఐటీ రంగంలో కర్ణాటకను సైతం తెలంగాణ అధిగమించిందన్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు.అయితే.. కొందరు మతతత్వంతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలందరూ ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ అని చెప్పారు.