పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకముందు గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్థితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తుందన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన ఈ సందర్భంలో ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోషపడాలన్నారు. వ్యవసాయం,సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజు రోజుకు గుణాత్మక అభివృద్ధిని నమోదుచేసుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. 2014 నుంచి 2019 మధ్య 17.24 వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచినట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సంవృద్ధి సాధించినట్లు చెప్పారు. మిషన్ భగీరథ పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. రాష్ట్రంలో బిందెల కొట్లాట, తాగునీటి కోసం యుద్ధాలు లేవన్నారు.
2013-14లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5,05,849 కాగా.. 2021-22 నాటికి రూ.11,54,860కోట్లకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తుందన్నారు.