ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి పని చేస్తున్నాం : సీఎం కేసీఆర్
CM KCR Speech at 75th Independence day.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా
By తోట వంశీ కుమార్ Published on 15 Aug 2021 6:09 AM GMTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని, జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని వివరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని తెలిపారు. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నానన్నారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ ప్రస్థానం లోని వెలుగు నీడల్నిమనందరం వివేచించుకోవాలని, మనం సాధించింది ఏమిటి ? ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేసుకోవాలన్నారు.
ఓ వైపు దేశం అనేక రంగాలలో కొంతమేరకు పురోగతిని సాధించిందని అదేసమయంలో నేటికీ చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి" అని మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటనూ ఇప్పటికీ మనం అన్వయించుకో వలసిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ వివరించారు. మరింత నిబద్ధత, నిజాయితీ. సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారతప్రజలు పునరంకితం కావాలని కోరుకుంటున్నానన్నారు.
తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించామని తెలిపారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అనేక ఆటంకాలు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధి ఆగలేదన్నారు. ప్రణాళికాబద్దంగా ముందుకు వెలుతున్నామని..అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు వెల్లడించారు.
ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్ చెప్పారు.