గవర్నర్ తేనేటి విందు.. సీఎం కేసీఆర్ గైర్హాజరు
CM KCR skips TS Governor’s At Home.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
By తోట వంశీ కుమార్ Published on 16 Aug 2022 7:20 AM ISTస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందుకు సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎం హాజరు అవుతారని తొలుత సమాచారం అందినప్పటికీ చివరి నిమిషంలో రద్దు అయినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎమ్మెల్సీ రమణ, బీజేపీ ఎంపీ అరవింద్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, రాంచంద్రరావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో కనిపించలేదు. కరోనా కారణంగా రేవంత్ రెడ్డి, పాదయాత్ర కారణంగా బండి సంజయ్ హాజరుకాలేదు.
ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సీఎం కేసీఆర్‌కు తానే స్వయంగా లేఖలు పంపి వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు గవర్నర్ తెలిపారు. ముఖ్యమంత్రి సాయంత్రం 6.55 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారని సీఎంఓ నుంచి సమాచారం అందిందని, తనతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం సీఎం కేసీఆర్ కోసం నిరీక్షించినట్లు చెప్పారు.
ఇక.. ముఖ్యమంత్రి రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అరగంట పాటు వేచి చూసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గవర్నర్, సీఎం మధ్య నిర్మాణాత్మక సంబంధాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.