లాక్‌డౌన్ విధించం.. ప్రజలు స్వచ్చందంగా కరోనా మీద యుద్దంలో భాగస్వాములు కావాలి : కేసీఆర్
CM KCR says no lockdown in telangana.తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 7 May 2021 2:25 AM GMTతెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రజాజీవనం స్తంబించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం సీఎం గురువారం ప్రగతిభవన్‌కు వచ్చారు. వచ్చిన వెంటనే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశాన్నినిర్వహించి, కూలంకషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ పై మాట్టాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదన్నారు. దీని వల్ల ప్రజాజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు.
గత అనుభవాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా కరోనా మీద యుద్దంలో భాగస్వాములు కావాలన్నారు. అందరం కలిసి కట్టుగా పోరాడితేనే ఈ మమమ్మారిని అంతం చేయొచ్చునని చెప్పారు. ఇక సెకండ్ వేవ్ మే 15 తరువాత తగ్గిపోతుందని నివేదికలు సూచిస్తున్నాయని.. అయినప్పటికి ఎవ్వరూ కూడా అశ్రద్ద చేయవద్దన్నారు. ఎవరికైనా అనుమానం వచ్చినా.. కరోనా పరీక్షల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు.
ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్ అందుతున్నది? ఇంకా ఎంతకావాలి? వ్యాక్సిన్‌లు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయి? రోజుకు ఎంత అవసరం? రెమ్‌డెసివిర్ మందు ఏ మేరకు సరఫరా అవుతున్నది? రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని కావాలి? అనే విషయాలతోపాటు ఆక్సిజన్ బెడ్ల లభ్యత తదితరాలపై పూర్తిస్థాయిలో చర్చించారు. రెమ్‌డెసివిర్ తయారీ సంస్థలతో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి వాటి లభ్యతను మరింత పెంచాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హాస్పిటల్స్, ఏరియా దవాఖానల్లో మొత్తం 5,980 కొవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.