పల్లె, పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ ధాన్యం సేకరణపై, వైకుంఠధామాలు, మార్కెట్ల నిర్మాణం, ప్రకృతి వనాలు అభివృద్ధిపై, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చిస్తున్నారు.
ఈ మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలపై ఆరా తీశారు. గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో నిధుల సమీకరణ గురించి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో దోబీ ఘాట్లు, మార్కెట్ల నిర్మాణాల వివరాలు, పట్టణ ప్రగతిలో మార్పులపై పలు సూచనలు చేయనున్నారు.