ప‌స‌లేని నిష్ర్ప‌యోజ‌న‌క‌ర బ‌డ్జెట్ : సీఎం కేసీఆర్

CM KCR responds on Union Budget 2022.ఈ రోజు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై తెలంగాణ ముఖ్య‌మంత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 5:27 PM IST
ప‌స‌లేని నిష్ర్ప‌యోజ‌న‌క‌ర బ‌డ్జెట్ : సీఎం కేసీఆర్

ఈ రోజు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించారు. ఇదో ప‌నికి మాలిన‌, ప‌స‌లేని బ‌డ్జెట్ అని విమ‌ర్శ‌లు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌తో పాటు దేశ రైతాంగం, సామాన్యులు, పేద‌లు, ఉద్యోగుల‌కు తీవ్ర నిరాశ నిస్ఫృహ‌ల‌కు గురిచేసింద‌న్నారు. ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని, వేతన జీవుల కోసం ఇన్‌కమ్‌ట్యాక్స్ శ్లాబులలో మార్పులు చేయకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చ‌దివి వినిపించిన బ‌డ్జెట్ ప్ర‌సంగం అసాంతం డొల్ల‌త‌నంతో నిండి, మాట‌ల గార‌డితో కూడి ఉంద‌న్నారు.

దశ, దిశ, నిర్దేశం లేని ఈ బడ్జెట్‌తో ఉపయోగం ఏమీ లేదన్నారు. బడ్జెట్ చాలా గొప్పగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటోందని ఎద్దేవా చేశారు. వ్య‌వ‌సాయ రంగాన్ని ఆదుకునే దిశ‌గా కేంద్రం తీసుకున్న‌ చ‌ర్య‌లు శూన్యమ‌న్నారు. దేశ రైతాంగానికి, వ్య‌వ‌సాయ రంగానికి ఈ బ‌డ్జెట్‌ను బిగ్‌బీరో అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉద్యోగులు, చిరు వ్యాపారుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేశార‌న్నారు. ఆదాన‌ప‌న్నుల్లో స్లాబ్స్‌ను మార్చ‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఆధాయ‌ప‌న్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉద్యోగ వ‌ర్గాలు, ప‌న్ను చెల్లింపుదారుల‌పై కేంద్ర బ‌డ్జెట్ నీరు చ‌ల్లింద‌ని ఆరోపించారు.

కరోనా కష్టకాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా వైద్య రంగంలో మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ది చేస్తుంటే.. ఆ దిశ‌గా కేంద్రానికి సోయి లేక‌పోవ‌డం దురదృష్టకరమన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని సీఎం కేసీఆర్ విమ‌ర్శలు చేశారు.

Next Story