'సాయిచంద్ మరణం తీవ్రంగా కలచివేసింది'.. సీఎం కేసీఆర్ ఆవేదన
తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.
By అంజి Published on 29 Jun 2023 8:52 AM GMT'సాయిచంద్ మరణం తీవ్రంగా కలచివేసింది'.. సీఎం కేసీఆర్ ఆవేదన
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. సాయిచంద్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్ ఎదుట సాయి చంద్ భార్య బోరును విలపించింది. దుఃఖాన్ని తట్టుకోలేక ఏడుస్తున్న సాయి చంద్ భార్యను సీఎం కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ నివాళులు అర్పించారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందని కేసీఆర్ అన్నారు.
చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని పేర్కొన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తంచేశారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు.
సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే వున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా వుంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సాయిచంద్ అద్భుతమైన కళాకారుడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని, సాయిచంద్ మరణం తీరని లోటని తెలిపారు. ఉద్యమంలో పాటల ద్వారా అందరిని ఏకం చేశారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా పాటలు పాడారని చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు.