ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం కేసీఆర్
ఎన్నికలు వస్తాయి.. పోతాయి కానీ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీనే గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 10:16 AM GMTఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం కేసీఆర్
ఎన్నికలు వస్తాయి.. పోతాయి కానీ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీనే గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పుడే ప్రజల కోరికలు నెరవేరతాయని చెప్పారు. అందుకే ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రసంగించారు.
తెలంగాణ ఏ్పడిన తర్వాత మూడోసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ ప్రజాస్వామ్య పరిణితి రాలేదన్నారు. ఏ దేశాల్లో అయితే అది వచ్చిందో ఆ దేశాలు ముందుకు పోతున్నాయని చెప్పారు. మనం దేశంలో మాత్రం అది లేదన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే ఉద్దేశంతోనే రైతుబంధు తెచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అది ఎన్నికల కోసం తెచ్చింది కాదన్నారు. తెలంగాణలో నీళ్లు ఉచితమే.. అలాగే కరెంటు ఉచితమే అని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అయితే.. రైతులకు ఇప్పటికే రుణమాఫీ చేశామనీ.. కానీ.. కొందరికి మాఫీ చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది పూర్తి చేయలేకపోయామన్నారు కేసీఆర్. ఈసీ అనుమతి ఇస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తిచేస్తామన్నారు. గతంలో రైతులకు సాయం చేయాలని కూడా ఎవరూ ఆలోచించలేదని సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు కాంగ్రెస్ నాయకులు ఇవాళ నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు దుబారా ఖర్చు అని అంటున్నారనీ చెప్పారు. ధరణిని తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్స్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాకుండా ఉండాలని ఆలోచించే కాపలదారే బీఆర్ఎస్ అన్నారు. నిర్మల్‌ను జిల్లాగా చేయించిందే ఇంద్రకరణ్‌రెడ్డి అని చెప్పారు. బాసర నుంచి ఆదిలాబాద్, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా సమయం పడుతది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కావాలని గంటసేపు వాదించారు. నాలుగు జిల్లాలు చేయాలని అడిగారు. ఈ నాలుగు జిల్లాలు చేసిందే ఇంద్రకరణ్ రెడ్డినే అని చెప్పారు. అయితే.. ఇంజినీరింగ్ కాలేజ్ కావాలని ఇంద్రకరణ్‌రెడ్డి అడిగారని.. తాను పుట్టిన ప్రాంతం కాబట్టి అన్నీ అడుగుతున్నారని చెప్పారు. నిర్మల్ చాలా అభివృద్ధి చెందింది అనీ.. ఇంద్రకరణ్‌రెడ్డికి 70వేల మెజారటీ తీసుకురావాలని పిలుపునిచ్చారు. జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజ్‌ను కూడా మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.