ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 12.45ని లకు మహబూబ్‌నగర్ చేరుకోనున్నారు. జిల్లా అధికారుల కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నాం 3 గంటల ప్రాంతంలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తరువాత కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఎంవీఎస్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక తరువాత జరుగుతున్న తొలి బహిరంగ సభ. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన తరువాత ఇంత వరకు దానిపై ముఖ్యమంత్రి స్పందించలేదు. ఈ సభా వేదికపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది.
సీఎం పర్యటన నేపథ్యంలో నగరం మొత్తం గులాబీమయంగా మారింది. పట్టణంలో రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. భారీగా గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.