తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించింది.
By అంజి Published on 17 Sept 2023 12:44 PM IST
తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గడ్డపై అనేక సందర్భాల్లో పోరాటాలు జరిగాయని, ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురొడ్డి నిలిచారని అన్నారు. తెలంగాణ చరిత్ర పూటల్లో సెప్టెంబర్ 17కి ఓ ప్రత్యేకత ఉందని అన్నారు. భారత్‌లో హైదరాబాద్ రాజ్యం అంతర్భాగమైన రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
ఆనాటి ప్రజా పోరాటాలు, త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయన్నారు. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని తెలిపారు. దొడ్డి కొమురయ్య నుంచి చాకలి ఐలమ్మ దాకా, కుమ్రం భీమ్ నుంచి రావి నారాయణరెడ్డి దాకా, షోయబ్ ఉల్లాఖాన్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి దాకా, స్వామి రామానందతీర్థ నుంచి జమలాపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుంచి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులూ, త్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, ప్రజానీకానికీ తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ తర్వాత మహోద్యమానికి సారథ్యం వహించడం చరిత్ర తనకందించిన మహదవకాశమని కేసీఆర్ పేర్కొన్నారు. ''స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం నా భుజస్కంధాలపైనే మోపారు. రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయి. 76 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరం'' అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదని, ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఏంటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగామన్నారు. 'తెలంగాణ ఆచరిస్తోంది- దేశం అనుసరిస్తోంది' అన్న మాట అక్షర సత్యమని కేసీఆర్ పేర్కొన్నారు. “సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలి” అన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగిందన్నారు.