తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విద్యాబోధన తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఇది సువర్ణాధ్యాయం, మరిచిపోలేని రోజు అని అన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శం కాబోతుందని కొనియాడారు. కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చేందుకు మంత్రి హరీష్‌రావు ఎంతో కృషి చేశారన్నారు. మంత్రి హరీశ్ రావు కృషిని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు సహకరించిన సీఎస్, సహా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు.
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,790కి పెరిగిందన్నారు. గతంలో 850 సీట్లు మాత్రమే ఉండేవన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయాన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు.
మహబూబ్‌నగర్, వనపర్తి లాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరన్నారు. ప్రతి జిల్లాలకు ఓ మెడికల్ కాలేజీ రావాలని సంకల్పించుకున్నానని. ఇప్పుడు ప్రారంభించిన వాటితో కలిసి మెడికల్ కాలేజీల సంఖ్య 17కి చేరిందన్నారు. మరో 17 జిల్లాల్లోనూ వైద్య కాలేజీలు రావాల్సి ఉందన్నారు. కరోనా లాంటి మహమ్మారులు, ఇతర వైరస్‌ల బెడద రాకూడదని, వైద్య విద్యార్థులతో రాష్ట్రానికి వైద్య కవచం నిర్మించుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.