తెలంగాణ సీఎం కసీఆర్.. వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి వెళ్లిన సీఎం.. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం దగ్గర టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. పర్యటనలో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వికారాబాద్ కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తై సంవత్సరం గడుస్తోంది. కేసీఆర్‌కు సమయం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం కోసం ఇన్ని నెలలు వేచి చూడాల్సి వచ్చింది.
తాజాగా రూ.42 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంలో కేవలం 12 శాఖలు మాత్రమే ఉండగా కీలక శాఖలన్నీ బయటే కొనసాగుతున్నాయి. ఎన్నేపల్లిలో సమీకృత కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.