ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్
CM KCR Good news to Field Assistant.రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
By తోట వంశీ కుమార్ Published on 15 March 2022 10:24 AM GMTరాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా ముఖ్యమంత్రి సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చజరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పారు. వారిని విధుల్లోకి తీసుకుంటున్నామని.. మళ్లీ సమ్మెలాంటి పొరపాటు చేయొద్దన్నారు. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారన్నారు. సెర్ఫ్ సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సెర్ప్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.
బడ్డెట్ అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తారు. పసలేని, పనికిమాలిన బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తాయి. గత కొన్నేళ్లుగా ఇదే విధమైన ధోరణి కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. మొట్టమొదటి దేశ బడ్జెట్ 190 కోట్లని.. దాంట్లో 91 కోట్లు రక్షణ రంగానికే కేటాయించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల బడ్జెట్ రూ.లక్షల కోట్లకు పెరిగిందన్నారు.
ఇక.. తన ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్న సభ్యులకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో చట్టసభల్లో జరగవలసిన చర్చల సరళి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. యువ నాయకత్వానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సక్రమైన చర్చలు జరిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తామన్న చర్యలు.. కేంద్రం చేపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బాగుంటే దేశమంతా బాగుంటుందన్నారు. ప్రస్తుతం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వ ధోరణి ఉందన్నారు.