సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీటీ స్కాన్, ఇతర పరీక్షల కోసం సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అంతకుముందు ఫాంహౌస్‌లో కేసీఆర్‌కు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయితే వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు.
అక్కడ సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు.
యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షల ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా ఫాంహౌస్ కి బయలుదేరి వెళ్లారు. ఇదిలావుంటే.. రెండు రోజుల క్రితం కేసీఆర్ యాంటీజెన్ పరీక్ష చేయించుకోగా కొవిడ్ లక్షణాలున్నట్లు తేలింది. ఆర్‌టీపీసీఆర్ పరీక్ష సైతం నిర్వహించగా.. అందులోనూ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.