తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. కొత్త పీఆర్సీ ఏర్పాటు, 5 శాతం మధ్యంతర భృతి
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు పెంచేందుకు వేతన సవరణ కమిషన్‌ని నియమిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
By అంజి Published on 3 Oct 2023 8:27 AM ISTతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. కొత్త పీఆర్సీ ఏర్పాటు, 5 శాతం మధ్యంతర భృతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆరు నెలల్లోగా వేతనాలు, పింఛన్ల సవరణకు సిఫార్సుల కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం నాడు కొత్త వేతన సవరణ కమిటీ (పిఆర్‌సి)ని ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్‌గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను, సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో -159 జారీచేశారు. కమిటీ 6 నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.
అంగన్‌వాడీలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీని వర్తింపజేయనున్నారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఆర్సీతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం గుడ్‌న్యూస్ చెప్పడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ జూలై 2018లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి పీఆర్సీని ఏర్పాటు చేశారు. అయితే డిసెంబర్ 2020లో కమిషన్ తన నివేదికను సమర్పించిన తర్వాత, ఏప్రిల్ 2021లో మాత్రమే వేతన సవరణలు అమలులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి మార్చి, 2021లో 30 శాతం ఫిట్‌మెంట్ (ప్రాథమిక వేతన పెంపు) ప్రకటించారు. ఇది ఏప్రిల్ 2021లో అమల్లోకి వచ్చింది.
కేసీఆర్.. ఫిబ్రవరి 2015లో కొత్త పిఆర్‌సి పే స్కేల్‌ను 43 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించగా, మార్చి 2015లో అమల్లోకి వచ్చింది, జూన్ 2014 నుండి ఈ పిఆర్‌సిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఆందోళనలు, విభజనపై అనిశ్చితి కారణంగా 25 శాతం ఫిట్‌మెంట్ కోసం పిఆర్‌సి సిఫార్సులు అమలు కాలేదు.
గత తొమ్మిదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను పెంచినప్పటి నుండి కేంద్రం వద్ద ఉన్న వారి కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో అత్యధిక వేతనాలు అందిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఉద్యోగులకు వాగ్దానం చేశానని, ఆ హామీని నెరవేర్చానని చెప్పారు.