MIMతో కలిసే ఎన్నికలకు బీఆర్ఎస్.. మేనిఫెస్టో ఎప్పుడంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 10:08 AM GMTMIMతో కలిసే ఎన్నికలకు బీఆర్ఎస్.. మేనిఫెస్టో ఎప్పుడంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. మొత్తం 119 స్థానాలు ఉండగా.. 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎన్నికల యుద్ధానికి శంఖారావం పూరించారు. ఎప్పటిలానే ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కదనరంగంలో తానే ఫస్ట్ అని నిరూపించారు. అయితే..దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. నర్సాపూర్, జనగామ, నాంపల్లి గోషామహల్ సీట్లలో అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టారు. మరో ఏడు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను మార్చి ప్రకటించారు.
ఇక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలో నిలవనున్నారు కేసీఆర్. ఇక ఎప్పటిలానే సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేస్తారు. బీఆర్ఎస్ తొలిజాబితాలోనే 95 శాతం అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాలు కసరత్తులను మరింత ముమ్మరం చేశాయి. వేగంగా అభ్యర్థులను ప్రకటించి అంతే వేగంగా ప్రచారంలోకి వెళ్లాలని భావిస్తున్నాయి.
ఎంఐఎంతో స్నేహం కొనసాగింపు:
అయితే.. ఈ సారి కూడా ఎన్నికల్లో ఎంఐఎంతో స్నేహం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 2014 నుంచి మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం స్నేహాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజలు దీవిస్తారనే నమ్మకం తమకు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రగతి పథంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. కొత్త రాష్ట్రమే అయినా.. వనరులు తక్కువే ఉన్నా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అభివృద్ధి చేసుకోగలిగాం అని చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి లభించని వారు, మార్పులు జరిగిన చోట్ల అభ్యర్థులు ఎవరూ నిరాశ చెందొద్దని సీఎం కేసీఆర్ కోరారు. కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రమే కాదు.. ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇలా చాలా పదవులు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, పదువులు కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ కేటాయించామని చెప్పారు. మైనంపల్లి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆయన తన కుమారుడికి మెదక్ టికెట్ వస్తుందని ఆశించారు. ఆయన పోటీ చేస్తానంటే చేయొచ్చు.. లేదంటే ఆయన ఇష్టమని చెప్పారు. ఆయన నిర్ణయానికి అడ్డుచెప్పబోమని సీఎం కేసీఆర్ అన్నారు.
అక్టోబర్ 16న మేనిఫెస్టో
అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ భారీ బహిరంగ సభలోనే రాబోయే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. ఇతర పార్టీలలాగా నెరవేర్చలేని హామీలను తాము ఇవ్వలేమని ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.. దశాబ్దాలు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. తాము గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వనివి కూడా అమలు చేశామని గుర్తు చేశారు. రైతుబంధు, జిల్లాకో మెడికల్ కాలేజ్ మేనిఫెస్టోలో చెప్పలేదని.. కానీ చేసి చూపించాం కదా అన్నారు. అయితే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తూ.. పోతూ ఉంటుందని.. అన్ని పనులు కచ్చితంగా చేస్తామని అన్నారు. అంతేకాక కరోనా, నోట్లు రద్దు వల్ల కాస్త ఇబ్బందులు తలెత్తాయని సీఎం కేసీఆర్ అన్నారు.