ఎగ్జిట్‌పోల్స్ పరేషాన్ వద్దు.. BRSదే విజయం: సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  1 Dec 2023 5:36 PM IST
cm kcr, brs,   exit polls, telangana,

ఎగ్జిట్‌పోల్స్ పరేషాన్ వద్దు.. BRSదే విజయం: సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్‌ కోసం అభ్యర్థులతో పాటు.. రాజకీయ నాయకులు. రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ తర్వాత విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ చర్చనీయాంశంగా మారాయి. దాదాపు ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌కు మెజార్టీ వస్తున్నట్లు అంచనా వేశాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ నాయకుల్లో కొంత ఆందోళన నెలకొందనే చెప్పాలి. ఒక వైపు కాంగ్రెస్‌ నేతలు ఈ ఎగ్జిట్‌ పోల్స్‌తో అప్రమత్తం అవుతూ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హోటళ్లు బుక్‌ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్‌ అగ్ర నేతలు మాత్రం తమనే విజయం వరిస్తుందని.. డిసెంబర్‌ 3వ వరకు వేచి ఉండాలని అంటున్నారు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ స్పందించారు. ఎగ్జిట్‌ పోల్స్‌తో పరేషాన్ కావొద్దని పార్టీ నేతలకు సూచించారు. మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం రానుందని చెప్పుకొచ్చారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌ను పలువురు బీఆర్ఎస్‌ నాయకులు కలిశారు. ఈక్రమంలోనే వారు ఎగ్జిట్‌ పోల్స్‌ గురించి సీఎం కేసీఆర్ దగ్గర ప్రస్తావించగా.. వాటి గురించి పరేషాన్ పెట్టుకోవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతోనూ ఆందోళన చెందవద్దని చెప్పారు. తెలంగాణను మరోసారి పాలించబోయేది బీఆర్ఎస్‌ ప్రబుత్వమే అని చెప్పారని సమాచారం. ఆదివారం సాయంత్రానికి కల్లా ఇది తేలిపోతుందని.. ఆ తర్వాత సంబరాలు చేసుకుంటామని చెప్పినట్లు తెలిసింది.

కాగా.. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో నవంబర్‌ 30న పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా.. మొదట ఈవీఎంలు మొరాయించినా.. ముందు నుంచి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగింది. ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే వాటిని అధికారులు క్లియర్ చేశారు. ప్రస్తుతం అందరు అభ్యర్థుల భవిష్యత్‌ ఈవీఎం బాక్సుల్లో ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపుపై ఆసక్తి కొనసాగుతోంది.

Next Story