స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వజ్రోత్సవ ద్విసప్తాహం
CM KCR asks officials for Grand Celebrations of independence Day Diamond Jubilee Celebrations.దేశభక్తి భావన, స్వాతంత్య్ర
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2022 3:37 AM GMTదేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. యువతీ, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు సహా యావత్ తెలంగాణ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం'కార్యక్రమంపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కేశవరావు సహా 24 మంది సభ్యులు, మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, సబితా, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హెచ్ఐసీసీలో వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 15 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 16న రాష్ట్రమంతటా ఏకకాలంలో 'తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన'నిర్వహించాలని, ఎక్కడివాళ్లక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, అన్ని రకాల స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు ఉంటాయన్నారు.
కార్యక్రమాల్లో కొన్ని..
- బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు సహా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరణలు చేపట్టనున్నారు.
- ప్రతిరోజూ ప్రార్ధన సమయంలో విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.
- ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించాలి.
-రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో 'గాంధీ'సినిమాను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలి.
- స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలను, ముషాయిరాలు చేపట్టాలి.
- ప్రముఖ గాయకులు, సంగీత విధ్వాంసులతో సంగీత విభావరి.
- రవీంద్ర భారతిలో 15 రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి.
వజ్రోత్సవాల షెడ్యూల్
- ఆగస్టు 08న ప్రారంభ సమారోహం
- ఆగస్టు 09 నుంచి ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం.
- ఆగస్టు 10న గ్రామాల్లో మొకలు నాటడం, ఫ్రీడం పారుల ఏర్పాటు
- ఆగస్టు 11న ఫ్రీడం రన్ నిర్వహణ
- ఆగస్టు 12న రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలు
- ఆగస్టు 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు
- ఆగస్టు 14న సాయంత్రం నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు
- ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ
- ఆగస్టు 16న 'ఏకకాలంలో, ఎకడివారకడ 'తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
- ఆగస్టు 17న రక్తదాన శిబిరాల నిర్వహణ
- ఆగస్టు 18న ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ
- ఆగస్టు19న దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ
- ఆగస్టు 20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీ
- ఆగస్టు 21న అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు
- ఆగస్టు 22న ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు