CM KCR : రైతులకు సీఎం కేసీఆర్ భరోసా.. ఎకరాకు రూ.10వేలు పరిహారం
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 9:16 AM GMTరైతులకు పంట నష్ట పరిహారం ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగళ్ల కారణంగా పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించిన ముఖ్యమంత్రి అనంతరం రైతులతో మాట్లాడారు.
వారి నుంచి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని తెలిపారు. ఇంతకముందు పంపిన వాటికే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం పంపలేదన్నారు. రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని, సహాయ పునరావాస చర్యలు అని అంటారన్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల 255 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ఇప్పుడిప్పుడే వ్యవసాయం నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది. అప్పుల ఊబిలోంచి రైతులు తేరుకుంటున్నారు.
Live: CM Sri KCR interacting with hailstorm-affected farmers of Reddykunta Thanda, Mahabubabad Dist https://t.co/IiaIcCG8LX
— Telangana CMO (@TelanganaCMO) March 23, 2023
మూర్ఖులైన కొందరు ఆర్థికవేత్తలు వ్యవసాయం దండగ అని అంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కంటే కూడా రాష్ట్ర తలసరి ఆధాయం ఎక్కువ. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందింది. ఇది మనకు చాలా గర్వకారణమం. రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు. ప్రభుత్వం అండదండగా ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో రైతులు నిరాశపడొద్దు. జరిగిన నష్టానిక ఏ మాత్రం చింతించకుండా రైతులు భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి సూచించారు.