స్వ‌ప్న‌లోక్ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్‌లోని స్వ‌ప్న‌లోక్ కాంప్లెక్స్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2023 2:00 PM IST
Swapnalok Fire Accident, Secunderabad

స్వ‌ప్న‌లోక్ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

సికింద్రాబాద్‌లోని స్వ‌ప్న‌లోక్ కాంప్లెక్స్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డంతో పాటు ప‌లువురు గాయ‌ప‌డ‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు గాయ‌ప‌డిన వారికి ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌న్నారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.

సికింద్రాబాద్‌లోని స్వ‌ప్న‌లోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. . 8 అంత‌స్తులు ఉన్న ఈ భ‌వ‌నంలో మొద‌ట ఏడో అంత‌స్తులో షార్ట్ స‌ర్య్కూట్‌తో మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి నాలుగో అంత‌స్తు వ‌ర‌కు వ్యాపించాయి. ఐదో అంత‌స్తులో పేలుడు సంభ‌వించ‌డంతో మంట‌లు భారీగా ఎగిసిప‌డ్డాయి. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. మంటలు చెలరేగిన వెంటనే కాంప్లెక్స్‌లో పనిచేసే వారు, షాపింగ్ కోసం వచ్చిన వారు భ‌యంతో కింద‌కు ప‌రుగులు తీశారు. ఐదో అంత‌స్తులో పేలుడు జ‌ర‌గ‌డంతో కొంద‌రు కింద‌కు రాలేక‌పోయారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే ప‌ది ఫైరింజ‌న్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌లను అదుపులోకి తెచ్చాయి.

ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో న‌లుగురు మ‌హిళ‌లు కాగా ఇద్ద‌రు పురుషులు ఉన్నారు. మృతుల‌ను ప్ర‌మీల‌, వెన్నెల‌, శ్రావ‌ణి, త్రివేణి, శివ, ప్ర‌శాంత్‌గా గుర్తించారు. పొగ కార‌ణంగా ఊపిరిఆడ‌క వీరు ప్రాణాలు కోల్పోయారు.

Next Story