సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర షెడ్యూల్ ప్రకటన
CLP leader Bhatti Vikramarka padayatra schedule announcement. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు
By Medi Samrat Published on 11 March 2023 11:06 AM GMTCLP leader Bhatti Vikramarka
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు పాదయాత్ర చేస్తున్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజరహత్నూర్ మండలం, పిప్పిరి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర పాదయాత్రను డిజైన్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్.. దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఒక్క లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని అన్నారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం ఇచ్చి వారికి మేము అండగా ఉన్నామని చెప్పడానికే తాను పాదయాత్ర చేస్తున్నానని భట్టీ విక్రమార్క వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని.. పాదయాత్రలో ప్రజలకు ధైర్యం చెబుతామన్నారు. 2023- 24 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని.. తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తామని అన్నారు.
దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తున్నదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి కుప్ప కూల్చింది. ప్రధాని తన స్నేహితులైన క్రోనీ క్యాపిటల్ లిస్టులకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. బిజెపి నాశనం చేస్తున్న ఈ దేశాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా చేస్తున్న పాదయాత్ర ద్వారా ప్రతి గడపగడపకు తీసుకువెళ్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గం అని ఇంటింటికి చెప్తామన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేస్తున్న పాదయాత్రలో అన్ని జిల్లాల అధ్యక్షులు, పిసిసి ఉపాధ్యక్షులు, పిసిసి ప్రధాన కార్యదర్శులు, పిసిసి సభ్యులు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములు చేసే పర్యవేక్షణ ఏఐసిసి నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. పాదయాత్ర లో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయి. ఈ బహిరంగ సభలకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురావడానికి ఏఐసీసీ ఇంఛార్జ్‌లు కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు.
ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎల్పీ నాయకుడిగా తెలంగాణలో పాదయాత్ర చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. మీ శక్తి మేరకు నాతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ప్రజలకు తెలియజెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మన అడుగులు ఉపయోగపడాలని అన్నారు. ప్రగతిశీల వాదులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కళాకారులు, తెలంగాణ కోసం పోరాడిన పోరాట యోధులు.. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జరిగే నా పాదయాత్రలో భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.