బంగారు తెలంగాణ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసిండని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కమలాపూర్ మండలం భీంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంపదను ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని.. కోరి తెచ్చుకున్న తెలంగాణలో కోటి సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతున్నారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన వద్దని ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం, ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఉండటానికి బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగమే ఎమ్మెల్యే ఈటెల వ్యాఖ్యలు అని అన్నారు.
రేవంత్ రెడ్డిపై బురదజల్లే విధంగా ఈటెల రాజేంద్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ, ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని అన్నారు. నీతి నిజాయితీగా ఉండే కాంగ్రెస్ పార్టీకి మీకున్న అలవాట్లు రుద్దవద్దన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా ముఖ్య భూమిక పోషించిన ఈటెల రాజేందర్.. కేసీఆర్ చేసిన దోపిడీలో భాగస్వామి అవుతాడని అన్నారు. బీఆర్ఎస్ పరిపాలన దోపిడీలో ఈటెల రాజేందర్ కూడా వాటాదారుడే నని అన్నారు. బీఆర్ఎస్ దోపిడి చేస్తుందని ఆరోపణలు చేస్తున్న ఈటెల రాజేందర్.. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యధారాలు ఇవ్వాలి కదా? ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికి రాజకీయంగా బతకడం కోసం బీజేపీ, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నారని అన్నారు.