'సీఎంవో మెలకువతోనే ఉన్నారా?'.. విద్యార్థిని ఆత్మహత్యపై ప్రవీణ్‌కుమార్ ట్వీట్
ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం సాయంత్రం తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 7 March 2023 9:26 AM GMTఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య (ప్రతీకాత్మకచిత్రం)
తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం సాయంత్రం తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిఖిత (13) అనే విద్యార్థిని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని పాఠశాలలో చదువుతోంది. విద్యార్థిని.. ఉపాధ్యాయులు ఎవరూ లేని సమయంలో తన క్లాస్‌లో స్కార్ఫ్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణం తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థుల మధ్య చిన్న సమస్యే కారణమని స్కూల్ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. అమ్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో వెనకబడిందని ఉపాధ్యాయులు వేధించడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) రాష్ట్ర అధ్యక్షుడు, టిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ) మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
''క్షమించండి.. ఈ రోజు తెలంగాణలోని సంక్షేమ పాఠశాలలో తరగతి గదిలో తన జీవితాన్ని ముగించుకున్న నిఖిత చిత్రాన్ని పంచుకోవడానికి గుండె పగిలింది. ప్రతి పాఠశాల/కళాశాలలో కౌన్సెలర్ల కోసం మేము డిమాండ్ చేస్తుంటే, మన పాలకులు రేసింగ్ కార్లు, మోసాలలో బిజీగా ఉన్నారు. @TelanganaCMO మీరు ఇంకా మెలకువగా ఉన్నారా?'' అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య నిరోధక సంస్థల హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. Call- 9152987821, AASRA-9820466726, Roshni Trust- 040-66202000.