రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రానున్న వర్షాకాలం నేపథ్యంలో వానలు, వరదల కారనంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు వస్తాయని భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెలలోనే ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని భావిస్తోంది. ఈ మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి అందజేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
కేంద్రం లేఖలు రాసిన నేపథ్యంలో.. జూన్, జులై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు కమిషనర్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. సన్న బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర సైతం మూడు నెలల కోటా పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.