తెలంగాణలో లాక్ డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను ప్రచారం చేశాడు.. పోలీసులు అరెస్ట్ చేశారు

Circulating fake GO man arrests.తెలంగాణలో రాత్రి వేళ‌ల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లుగా ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న చేసిన మాదిరిగా న‌కిలీ ఉత్త‌ర్వుల‌ను రూపొందించి వైర‌ల్ చేసిన యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2021 2:57 PM IST
Fake GO made man arrested

తప్పుడు కథనాలను కావాలనే షేర్ చేసే వారు ఎంతో మంది ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో ఇదే పనిగా పెట్టుకునే వాళ్లు కూడా లేకపోలేదు. క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో తెలంగాణలో రాత్రి వేళ‌ల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లుగా ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న చేసిన మాదిరిగా న‌కిలీ ఉత్త‌ర్వుల‌ను రూపొందించి వైర‌ల్ చేసిన యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం శ్రీపతి సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యేలా చేసిన‌ట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా స‌మావేశంలో తెలిపారు. నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని వివ‌రించారు. అత‌డి సొంగ ప్రాంతం నెల్లూరు టౌన్ అని, ఓ ప్రైవేటు సంస్థ‌లో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణ‌లో గ‌త ఏడాది లాక్‌డౌన్‌పై ప్ర‌భుత్వం ఇచ్చిన‌ జీవోను డౌన్‌లోడ్‌ చేసుకున్న శ్రీప‌తి అందులో మార్పులు చేసి కొత్త జీవోగా దాన్ని సృష్టించార‌ని అంజ‌నీ కుమార్ చెప్పారు. అనంత‌రం ఆ న‌కిలీ జీవోను సంజీవ్ తో పాటు అతడి స్నేహితులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారని తెలిపారు. త‌ప్పుడు ప్ర‌చారాల‌ను ఎవ్వ‌రూ షేర్ చేయొద్ద‌ని, నిజాన్ని నిర్ధారించుకోకుండా షేర్ చేసిన వారిపై కూడా కేసులు న‌మోదు చేస్తామ‌ని చెప్పారు.

ప్రభుత్వ జీవో గా చెప్పబడుతున్న ఓ లెటర్ ఏప్రిల్1, 2021 నుండి వైరల్ అవుతోంది. ఈ లెటర్ లో ఉన్న సమాచారంలో ఎటువంటి నిజం లేదని తెలంగాణ అధికారులు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో షాపులు మూసి వేయాలంటూ వైరల్ అవుతున్న సదరు లెటర్ ఫేక్ అని తేల్చేశారు కూడా. తెలంగాణ ప్రభుత్వం నుండి ఇలాంటి ఆర్డర్ బయటకు రాలేదని.. ఇంకా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఉంచాలని అనుకోవడం లేదని అధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఇప్పట్లో ఉండదని కేసీఆర్ అసెంబ్లీలోనే ఇటీవల తేల్చి చెప్పారు. లాక్ డౌన్లు ఉండవని, ఇండస్ట్రీలు మూసి వేయరని కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూ ఉన్నామని.. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని అన్నారు. కానీ కొందరు మాత్రం అదే పనిగా ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం మొదలు పెట్టారు. అలాంటి వారిపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. కాబట్టి ఒక్కోసారి ఇలాంటి కథనాలను షేర్ చేసే ముందు ఆలోచించుకోవాలి.




Next Story