HCA, SRH వివాదంపై సీఐడీ కీలక ప్రకటన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఎస్‌ఆర్‌హెచ్ వివాదంలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik
HCA, SRH వివాదంపై సీఐడీ కీలక ప్రకటన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఎస్‌ఆర్‌హెచ్ వివాదంలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటన విడుదల చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్‌సీఏ సీఈవో సునీల్, చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను అరెస్ట్ చేసినట్లు సీఐడీ తెలిపింది. నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించామని సీఐడీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం జగన్మోహన్ రావు నకిలీ పత్రాలతో పోటీ చేసినట్లు గుర్తించినట్లు సీఐడీ పేర్కొంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపింది.
మరో వైపు నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ గుర్తించింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసి.. శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ కోసం నకిలీ పత్రాలను సృష్టించినట్లు విచారణలో వెల్లడైందని సీఐడీ తెలిపింది. ఈ నకిలీ పత్రాల ద్వారానే ఓ క్లబ్ ఏర్పాటు చేసి..దీంతోనే జగన్మోహన్ రావు హెచ్‌సీఏలో అధ్యక్షుడిగా పోటీ చేశాడని సీఐడీ గుర్తించింది. జగన్‌మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీల్ కుట్రపూరితంగా ఎన్నిక అయ్యారు. నేర పూరిత నమ్మక ద్రోహంతో, ప్రజా ప్రతినిధులను సైతం తప్పుదోవ పట్టించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారు. కాంప్లిమెంటరీ టికెట్లపై జగన్మోహన్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. కార్పొరేట్ బాక్సులకు ఉద్దేశపూర్వకంగా తాళాలు వేసి వేధించారు. తాము చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు..అని సీఐడీ తెలిపింది.