హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే... రాజీవ్ యువ వికాసం పథకం. అయితే ఈ పథకం అమలులో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. దరఖాస్తుదారులు గతంలో ఏవైనా రుణాలు తీసుకుని కట్టకపోతే.. వారి అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దరఖాస్తుదారుల రుణ చరిత్ర, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
వాటి ఆధారంగా 40 శాతం అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం 16.25 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ మొత్తం వ్యయంలో 60 నుంచి 80 శాతం ప్రభుత్వం రాయితీ అందించనుంది. రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం రాయితీ, రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రూ.50 వేల రుణాలకు సంబంధించి చిన్న యూనిట్లకు, చిన్న నీటిపారుదల పథకాలకు అందించే రుణాలకు బ్యాంకు లింక్‌తో సంబంధం లేకుండా 100 శాతం రాయితీ అందించనున్నారు.